About Me

My photo
నా గురించి ఏమి చెప్పాలబ్బా?

Saturday, October 15, 2011

గుర్తు లేవా? గుర్తు రావా?


నిన్ను చూడాలని ఉంది, "ఇక్కడికి ఎప్పుడు వస్తావు" అని అమ్మ అంటే
అబ్బా, మా వీసా గొడవలు నీకు అర్ధం కావమ్మ అని విసుగు
కానీ
ఒక్క రోజు ఆలస్యంగా వస్తే ఆరాటం గా ఎదురు చుసిన అమ్మ గుర్తు రాదెందుకో

జీతాలు ఇప్పుడిక్కడ కూడా బాగా ఇస్తున్నారంట అని నాన్న అంటే
అయ్యో, అక్కడి లైఫ్ స్టైల్ చాలా కష్టం నాన్న అని సమర్ధింపు
కానీ
అయిదు వేల జీతం తో ఇంటిల్ల పాది కి ఏ లోటు రానీయని నాన్న గుర్తు రారెందుకో

"నేను బ్రతికుండగా" చూస్తానో లేదో అని నాన్నమ్మ అంటే
నీకేంటే నా కూతురు పెళ్లి కూడా చూస్తావు లే అని వ్యంగ్యపు మాటలు
కానీ
ఆమె పిట్ట కథలు విననిదే నిద్రించని చిన్న నాటి రోజులు గుర్తు రావెందుకో

లేని ఓపిక తెచ్చుకుని అస్పష్టంగా "ఎలా ఉన్నావు" అని తాతయ్య అంటే
అర్ధం కావట్లేదు, గట్టిగా మాట్లాడు అని గర్దింపు
కానీ
పురాణాలని వర్ణించి చెప్పిన ఆ గంభీర స్వరం గుర్తు రాదెందుకో

ఈ వయసులో అమ్మ నాన్న కి "నీ అవసరం" అని అక్క అంటే
నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం నీకిష్టం లేదా అని ప్రశ్న
కానీ
నా చదువు కోసం పై చదువులు మరిచిన ఆమె త్యాగం గుర్తు రాదెందుకో

Thursday, October 13, 2011

ఇలా ఎంత కాలం....అలా అంత దూరం!!!!!!


చినుకులా చిలిపిగా నవ్వి
ముల్లులా బుగ్గను గిల్లి
గాలిలా పెదవులు తాకి
వెన్నలై నడుమును తడిమి
వానలా తనువును తడిపి
ఎండలా గుండెలో మండి
మల్లెలా మనసున అల్లి
దీపమై కళ్ళలో వెలిగి
గూడులా ఎదలో వెలిసి
వలపులా ఆశెలు రేపి
ఇలా ఎంత కాలం....అలా అంత దూరం......

భావాలు.......





నేను మొదటి మాట పలికినప్పుడు మా అమ్మ చూపుల్లో అనురాగం
చిటికిన వేలు పట్టుకుని నను నిటారుగా నడిపిస్తున్న మా నాన్నలో గర్వం
తొలిసారి ఎవరి సాయం లేకుండా సైకల్ నడిపినప్పుడు నాలో కలిగిన ఆనందం
ఆకతాయి కుర్రాళ్ల అల్లర్లు చూసి నా గుండెలో తన్నుకొచ్చిన భయం
నువ్వే నా ప్రాణం అని నువ్వన్నప్పుడు అది కలా నిజమో అని అనుమానం
కన్యాదానం చేస్తున్న నాన్న కళ్ళలో కన్నీళ్ళా ఆనంద భాష్పాలో తెలియని అయోమయం
నీతో కలిసి ఏడు అడుగులేస్తున్నప్పుడు నా మనసులో తెలియని బిడియం
నా చేతి వంట తిని ఆటపట్టిస్తుంటే నాలో ఉబికి వచ్చిన ఉక్రోశం
 ప్రతి అడుగున నా వెనువెంట ఉండి నను ప్రోత్సహిస్తున్న నిన్ను చూసి నాలో పొంగిన అభిమానం
నా నిస్తేజానికీ నిరుత్సాహానికి కారణమేంటో చెప్పలేనంది నా మౌనం