About Me

My photo
నా గురించి ఏమి చెప్పాలబ్బా?

Saturday, October 15, 2011

గుర్తు లేవా? గుర్తు రావా?


నిన్ను చూడాలని ఉంది, "ఇక్కడికి ఎప్పుడు వస్తావు" అని అమ్మ అంటే
అబ్బా, మా వీసా గొడవలు నీకు అర్ధం కావమ్మ అని విసుగు
కానీ
ఒక్క రోజు ఆలస్యంగా వస్తే ఆరాటం గా ఎదురు చుసిన అమ్మ గుర్తు రాదెందుకో

జీతాలు ఇప్పుడిక్కడ కూడా బాగా ఇస్తున్నారంట అని నాన్న అంటే
అయ్యో, అక్కడి లైఫ్ స్టైల్ చాలా కష్టం నాన్న అని సమర్ధింపు
కానీ
అయిదు వేల జీతం తో ఇంటిల్ల పాది కి ఏ లోటు రానీయని నాన్న గుర్తు రారెందుకో

"నేను బ్రతికుండగా" చూస్తానో లేదో అని నాన్నమ్మ అంటే
నీకేంటే నా కూతురు పెళ్లి కూడా చూస్తావు లే అని వ్యంగ్యపు మాటలు
కానీ
ఆమె పిట్ట కథలు విననిదే నిద్రించని చిన్న నాటి రోజులు గుర్తు రావెందుకో

లేని ఓపిక తెచ్చుకుని అస్పష్టంగా "ఎలా ఉన్నావు" అని తాతయ్య అంటే
అర్ధం కావట్లేదు, గట్టిగా మాట్లాడు అని గర్దింపు
కానీ
పురాణాలని వర్ణించి చెప్పిన ఆ గంభీర స్వరం గుర్తు రాదెందుకో

ఈ వయసులో అమ్మ నాన్న కి "నీ అవసరం" అని అక్క అంటే
నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం నీకిష్టం లేదా అని ప్రశ్న
కానీ
నా చదువు కోసం పై చదువులు మరిచిన ఆమె త్యాగం గుర్తు రాదెందుకో

3 comments:

  1. ప్రస్తుత జీవన విధానంలో మారే మనుషుల ఆలోచనలను, ఎండమావుల వెంట తీసే పరుగులను చక్కగా చూపించారు! దీనిని చూసి కొంతమందిలో అన్నా మార్పు వస్తే ఎంత బాగుంటుందో! వృద్ధాశ్రమాలకి కాస్త విశ్రాంతి దొరుకుతుంది!

    ReplyDelete
  2. అవునండి...అప్పుడప్పుడు అనిపిస్తుంది...వాళ్ళలో నేను కూడా ఉన్నానేమో అని:-(

    ReplyDelete
  3. నిజాలు చెప్పారు. ఎక్కడ వున్నా అందరి పరిస్థితీ అదే. పరిస్థితి అని మనం పరిస్థితులనుంచి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నిస్తున్న దొంగలం.

    ReplyDelete